విద్యతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

కనగల్‌ : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కనగల్‌ మండల కేంద్రంలోని రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు చదువును దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే తిప్పర్తి, కనగల్‌ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్‌లో, కారులో, బండిమీద ఎలా తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎంజీ యూనివర్సిటీని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్‌ యూనివర్సిటీగా ఉందన్నారు. యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరంగ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ధర్వేశిపురం నుంచి కనగల్‌ –గుర్రంపోడు–దేవరకొండ మీదుగా డిండి వరకు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీల్లో కనగల్‌ –గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, చిట్ల వెంకటేశంగౌడ్‌, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్‌, సర్పంచ్‌ నర్సింగ్‌ మురళీధర్‌గౌడ్‌, ఆర్టీఏ నెంబర్‌ కూసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీసీ నర్సింగ్‌ కృష్ణయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

ఫ కనగల్‌లో జూనియర్‌ కళాశాల

నిర్మాణ పనుల పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement