వేగంగా కొనుగోళ్లు చేపట్టాలి
శాలిగౌరారం : మండలంలోని రామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాలిగౌరారం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యింది. దీనికి తోడు మిల్లర్ల పేచీలు, హమాలీ, లారీల సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఈనెల 24 నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీనది ఎగువనుండి వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరిగి.. ధాన్యం రాసులకు సమీపిస్తోంది. ప్రాజెక్టు ఆవరణలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నిల్వ ఉన్నాయి. చేతికి అందిన పంట సకాలంలో కొనుగోళ్లు జరగక.. ఎక్కడ ప్రాజెక్టు నీట మునిగి పోతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
శాలిగౌరారం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి సుమారు రెండు నెలలు కావస్తోంది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టులోకి మూసీ నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ధాన్యం రాసులు ప్రాజెక్టు నీటిలో మునిగిపోతాయేమోనని భయమేస్తోంది. ఇప్పటికై నా అధికారులు వేగంగా కొనుగోలు జరిగేలా చూడాలి.
– మాద నర్సింహ, రైతు, రామగిరి


