శాలిగౌరారం : శాలిగౌరారం అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ డ్రైవర్లు, యజమానులు శుక్రవారం ధాన్యం లోడుతో ఉన్న లారీని రోడ్డుకు అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లారీల యజమానులు, డ్రైవర్లు మాట్లాడుతూ ధాన్యం లోడుతో మార్కెట్‌యార్డుకు వచ్చి వారం రోజులకుపైగా నిరీక్షిస్తున్నామన్నారు. లారీలో అధిక లోడు ఉండటంతో టైర్లు దెబ్బతింటున్నాయని, దిగుమతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. మార్కెట్‌యార్డులో కనీసం మంచినీళ్లు కూడా లేవని, తిండిలేక డ్రైవర్లు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ట్రిప్పు కిరాయితో వారం రోజులు పైగా పడిగాపులు కాస్తుంటే లారీల ఫైనాన్స్ చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లారీల డ్రైవర్ల రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవరావు, ఎస్‌ఐ సైదులు అక్కడికి చేరుకొని డ్రైవర్లు, యజమానులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు తహసీల్దార్ చేతులు పట్టుకొని మా ఇబ్బందులు తీర్చాలని వేడుకున్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.


