వైటీపీఎస్‌కు రోజూ 15 ర్యాక్‌లు
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రం భవిష్యత్‌లో రైల్వే కారిడార్‌గా మారనుంది. 30 ఏండ్ల క్రితం దామరచర్ల మీదుగా నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్ సింగిల్‌గా ప్రారంభం కాగా ప్రస్తుతం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఆరు లైన్లుగా విస్తరించనుంది. ఇప్పటికే విష్ణుపురం స్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు రెండు లైన్లు నిర్మించారు. నడికుడి – బీబీనగర్ మార్గంలో ఇప్పటికే సింగిల్‌లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు జరుగుతుండగా డబుల్ లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. విష్ణుపురం– మోటుమర్రి రైల్వే మార్గం సింగిల్ లైన్ ఉండగా ప్రస్తుతం రెండో లైన్ మంజూరైంది. ఇదిగాక దామరచర్ల వద్ద నడికుడి – బీబీనగర్ రైల్వేలైన్, విష్ణుపురం– మోటుమర్రి లైన్‌ను అనుసంధానం చేసే బైపాస్ లైన్ (5 కిలో మీటర్ల) ఇటీవల మంజూరు చేశారు. అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో దామరచర్ల వద్ద ఎటు చూసినా రైల్వే లైన్లు కనిపించనున్నాయి. ఈ ఆరు లైన్లు వినియోగంలోకి వస్తే దామరచర్లకు మూడు వైపులా ఆర్‌యుబీ (వంతెన కింద రహదారి) ద్వారానే గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
కృష్ణానదిపై రైల్వే వంతెన..
నడికుడి – బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ (డబ్లింగ్) పనుల్లో భాగంగా వాడపల్లి వద్ద కృష్ణా నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 239 కిలో మీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.2,853 కోట్లు మంజూరు కాగా పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. మట్టికట్ట, కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. కృష్ణానదిపై వంతెన ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దామరచర్ల సమీపంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు విష్ణుపురం నుంచి 8కిలోమీటర్ల దూరం డబుల్ రైల్వేలైన్‌ను నిర్మించారు. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. రోజుకు సరాసరి 15 ర్యాక్ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీని వల్ల బొగ్గు గూడ్సు రైళ్లు నిత్యం తిరగనున్నాయి. వైటీపీఎస్ రైలు మార్గంలో రైళ్ల రద్దీ వల్ల ఈ ప్రాంతంలో రైలు కూత మర్మోగనుంది.
ఫ చుట్టూ ఆరు రైల్వే లైన్ల నిర్మాణం
ఫ మూడు వైపులా ఆర్‌యూబీ ద్వారానే గ్రామంలోకి రాకపోకలు


