నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో బైపాస్ నిర్మాణంలో నాసిరకం మట్టిని ఉపయోగిస్తూ నిధుల దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మట్టి మాఫియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండకు కేంద్ర ప్రభుత్వం రూ.530 కోట్లతో బైపాస్ మంజూరు చేస్తే నిర్మాణ విషయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు పాతర వేసిన కాంట్రాక్టర్‌కు మంత్రి, అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడ ఎర్రమట్టి ఉపయోగించడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, బుద్దారం, అనంతారం గ్రామాల్లోని చెరువుల నుంచి రూ.140 కోట్ల విలువైన నాసిరకం మట్టి తెచ్చి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతెపాక సాంబయ్య, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, దాయం భూపాల్‌రెడ్డి, చింత ముత్యాల్‌రావు, పోతెపాక లింగస్వామి, గుర్రం వెంకట్‌రెడ్డి, రావెళ్ల కాశమ్మ, వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, పురుషోత్తం పాల్గొన్నారు.


