నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించగా రెవెన్యూ శాఖకు 61, ఇతర శాఖలకు 52తో కలిపి మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన టీ–ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం పూర్తిచేయాలన్నారు. ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించాలన్నారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఎఫ్‌ఓ రాజశేఖర్, దేవరకొండ, చండూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు సమస్యలపై
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
ప్రస్తుత యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9963407064కు రైతులు ఫోన్ చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రబీలో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 కనీసం మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. సన్నధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటల పాటు విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


