జీఎస్టీ చెల్లింపు బాధ్యత ఏజెన్సీదే..
ఎంజీయూలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఓ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీ చెల్లించకుండా ఎగనామం పెట్టింది. యూనివర్సిటీకి ఈ ఏజెన్సీ సంస్థ జూనియర్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, డైనింగ్ హాల్స్ హెల్పర్లు, స్టోర్ కీపర్లు మొత్తంగా 113 మందిని కేటాయించగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందిని కేటాయించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ ఏజెన్సీ సంస్థ రూ.99 లక్షలు జీస్టీ ఎగ్గొడుతున్నా యూనివర్సిటీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అన్నీ తెలిసిన సందరు అధికారులు జీఎస్టీకి చెల్లించాల్సిన రూ.99 లక్షల విషయాన్ని దాచి పెడుతుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీ చెల్లించాలని పలు మార్లు జీస్టీ అధికారులు యూనివర్సిటీతోపాటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించడంలేదని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో యూనివర్సిటీ అధికారులు.. వర్కర్లకు ఇవ్వాల్సిన జీతాలు రెండు నెలలుగా ఏజెన్సీకి ఇవ్వకుండా నిలిపివేశారు. దాంతో వర్కర్లు, ఇతర ఉద్యోగులు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అధికారుల బాధ్యతారాహిత్యం..
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్కర్ల కోసం టెండర్లు పిలిచిన సమయంలోనే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ జీఎస్టీ సంస్థ నుంచి బకాయిలు లేనట్లు ఎన్‌ఓసీ సమర్పించాల్సి ఉంటుంది. కానీ సదరు యూనివర్సిటీ అధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా సదరు ఏజెన్సీ సంస్థకు టెండరు అప్పగించారు. మూడు నాలుగేళ్లుగా జీస్టీ చెల్లించడంలేదని జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కారణంగానే సదరు ఏజన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీస్టీ ఎగ్గొట్టింది. ఒక్కో ఉద్యోగికి 18 శాతం యూనివర్సిటీ జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, యూనివర్సిటీ నేరుగా 2 శాతం, ఏజెన్సీ ద్వారా 16 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ 16 శాతం డబ్బులను ఏజెన్సీ సంస్థ స్వాహా చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. యూనివర్సిటీలోని కొందరు అధికారులు ఏజెన్సీ సంస్థతో అంటకాగి ముడుపులు పుచ్చుకొని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా సహకరించినట్లు తెలిసింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఏ అధికారికి నోటీసులు వెళ్లినా కూడా ఏజెన్సీ సంస్థకు జీతాలు, జీఎస్టీ చెల్లింపు అతడిదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా, రిటైర్డ్ అయినా కూడా వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలనే నిబంధనలు కూడా ఉన్నాయి.
ఉద్యోగులను, వర్కర్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీకి ప్రతినెలా 16 శాతం జీఎస్టీ చెల్లించాం. జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చి మాట వాస్తవమే. ఏజెన్సీ యజమానికి కూడా నోటీస్ ఇచ్చాం. జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీదే.
– అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్
ఫ దాచిపెడుతున్న యూనివర్సిటీ అధికారులు
ఫ రెండు నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వని ఏజెన్సీ


