పెద్దవూర : ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ దేశ పర్యటనకు పెద్దవూర మండలం ఏనెమీదిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకట్‌రెడ్డి ఎంపికయ్యారు. మన రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన 28 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఫిన్లాండ్‌లో పర్యటించనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గుణాత్మక విద్య ద్వారా విద్యార్థుల ప్రగతి, రిసోర్స్ పర్సన్‌గా అనుభవం, పాఠ్యపుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వర్క్‌షాపుల్లో భాగస్వామ్యం, వినూత్న బోధన నైపుణ్యాలు మరియు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల ఆధారంగా వెంకట్‌రెడ్డిని ఎంపిక చేశారు. కాగా, గత ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో ఈయన యోగా విభాగంలో రాష్ట్రం తరపున జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణుడిగా, లైఫ్ స్కిల్ కోచ్‌గా సేవలు అందిస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. వెంకట్‌రెడ్డి ఎంపికపై జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి, ఎంఈఓ తరి రాము, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


