కోతలు ముమ్మరం.. | - | Sakshi
Sakshi News home page

కోతలు ముమ్మరం..

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

6న కేంద్రాలు ప్రారంభమయ్యేనా?

ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

పది రోజుల నుంచి కల్లాల్లోధాన్యం పోస్తున్న రైతులు

కొనుగోళ్లకు తప్పనిఎదురుచూపులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. యాసంగి వరి కోతలు పది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యం తీసుకొచ్చి కల్లాల్లో పోస్తున్నారు. గతేడాది యాసంగిలో మార్చి 25వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. ఈసారి ఏప్రిల్‌ నెల వచ్చినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ విషయంలో సమస్యల కారణంగానే ఇంకా కేంద్రాలను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కల్లాలకు భారీగా ధాన్యం

గత యాసంగి సీజన్‌్‌లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఒక్క చిట్యాల మండలంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సందర్భంగా నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం బుధవారం ఒకచోట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. అయితే అక్కడ కూడా ఇంకా కొనుగోళ్లు చేపట్టలేదు.

మిల్లర్లతో అధికారులకు కుదరని సయోధ్య

ఈసారి యాసంగి సీజన్‌లో పూర్తిగా రా రైస్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రా రైస్‌ ఇవ్వాలనే నిబంధన విధించింది. అయితే సాధారణంగా యాసంగి సీజన్‌లో రా రైస్‌ పూర్తి స్థాయిలో రావని, మిల్లింగ్‌ సమయంలో నూక అధికంగా వచ్చి, తాము నష్టపోవాల్సి వస్తుందని మిల్లర్లు అంటున్నారు. ఈసారికి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఈసారి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే తాము ధాన్యం దిగుమతి చేసుకోమని మిల్లర్లు చెబుతున్నారు. అయితే దీనిపై జిల్లా స్థాయిలో అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మిల్లర్లతో అధికారుల చర్చలు

అధికారులు ప్రభుత్వం విధించిన నిబంధనను మిల్లర్లకు వివరించి ధాన్యం దిగుమతి చేసుకోవాలని చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. సీఎంఆర్‌ కింద రారైస్‌ ఇస్తే నూక అధికంగా వచ్చి తాము నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని మిల్లర్లను ఒప్పించేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. మిల్లర్లు కూడా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ధాన్యం దిగుమతి విషయంలో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ, తిప్పర్తిలో కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కేంద్రాలు, కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement