భువనగిరిటౌన్ : 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోబోమని యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మిల్లుల్లో ఇప్పటికే భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, కొత్తగా వచ్చే ధాన్యాన్ని భద్రపరచడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మిల్లర్లు తెలిపారు. ప్రస్తుతం 2024–25 రబీ కాలానికి సంబంధించి సుమారు 90,000 టన్నుల ధాన్యం మిల్లుల వద్దే నిల్వ ఉందని, అదేవిధంగా 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి రా రైస్ పెట్టాల్సి ఉన్నందున, నిల్వలు పెరిగిపోయి మిల్లుల్లో అడుగు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పాత నిల్వలు పూర్తిగా డెలివరీ అయిన తర్వాతే కొత్త ధాన్యం దిగుమతి గురించి ఆలోచిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మార్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి అశోక్ స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం


