బాయిల్డ్ రైస్‌కే అవకాశం ఇవ్వాలి
నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ధాన్యం కల్లాలకు వస్తోంది. కానీ, కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఈ యాసంగిలో సీఎంఆర్‌గా (కస్టమ్ మిల్లింగ్ రైస్) రా రైస్ మాత్రమే పెట్టాలంటూ ఎఫ్‌సీఐ నిబంధన పెట్టింది. రా రైస్ సాధ్యం కాదని.. బాయిల్డ్ రైస్ అయితేనే పెడతామని మిల్లర్లు అంటున్నారు. లేదంటే ధాన్యం దించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు.
గతంలోనూ నిబంధన
యాసంగి సీజన్‌లో ఎప్పుడైనా బాయిల్డ్ రైస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా సమయంలో (2022–23) రారైస్ పెట్టాలని అప్పట్లో ఎఫ్‌సీఐ ఆదేశించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ధాన్యాన్ని మిల్లర్లు తీసుకున్నా.. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ధాన్యాన్ని టెండర్ ద్వారా వేలం వేసింది. దాంట్లో ఏడు మిల్లులు అక్రమాలకు పాల్పడటం వాటిపై కేసులు నమోదు కావడం ఒక మిల్లు యజమానులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎఫ్‌సీఐ బాయిల్డ్ రైస్‌నే తీసుకుంది. తాజాగా మళ్లీ ఈ యాసంగిలో రా రైస్ పెట్టాలంటూ నిబంధన పెట్టింది.
65 శాతం బియ్యం ఇవ్వలేమంటున్న మిల్లర్లు
యాసంగి సీజన్‌లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రా రైస్ ఇవ్వలేమని మిల్లులు చెబుతున్నారు. రా రైస్‌కు మిల్లింగ్ చేస్తే నూక శాతం పెరుగుతుందని 65 శాతం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని తాము బాయిల్డ్ రైసే ఇస్తామని చెబుతున్నారు. లేదంటే ధాన్యం దిగుమతి చేసుకోలేమని అంటున్నారు. దీంతో జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇది కొలిక్కి వస్తేనే ధాన్యం కొనుగోళు కేంద్రాల ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై రైతులు ధాన్యాన్ని కొందరు కల్లాలకు తెచ్చి ఆరబోస్తుండగా మరికొందరు మిల్లుల్లో అమ్ముకుంటున్నారు.
ఎఫ్‌సీఐ ఈ సీజన్‌లో రారైస్ ఇవ్వాలని తెచ్చిన నిబంధనపై పునరాలోచన చేయాలి. ఎండ తీవ్రత వల్ల మిల్లింగ్ చేస్తే ఎక్కువ నూక అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో రా రైస్ పెట్టడం సాధ్యం కాదు. ధాన్యం దించుకుంటే మిల్లర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ అయితే నిబంధనల ప్రకారం ఇవ్వగలుగుతాం. ఈ విషయంలో మిల్లర్లంతా ఆలోచన చేసి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తాం.
– రేపాల భద్రాద్రి రాములు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ఫ యాసంగి ధాన్యం సేకరణలో వీడని సందిగ్ధం
ఫ మిల్లర్లతో అధికారుల చర్చలు
380 కేంద్రాలు ఏర్పాటు
చేయాలని నిర్ణయం
జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 4 లక్షల వరకు సన్నాలను మిల్లర్లు నేరుగా కొటారని, 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. మొత్తం 380 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధం చేశారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ 1న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సారి కూడా ఏప్రిల్ 1నే ప్రారంభించే అవకాశం ఉంది.


