వానాకాలం 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా | - | Sakshi
Sakshi News home page

వానాకాలం 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా

Mar 28 2026 7:18 AM | Updated on Mar 28 2026 7:18 AM

విత్తనాలు సిద్ధంగా ఉంచుతాం

నల్లగొండ అగ్రికల్చర్‌ : వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసింది. అందులో పత్తి 5,13,524 ఎకరాలు, వరి 5,86,137 ఎకరాలు, కంది 14 వేలు, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న 500, గడ్డి జొన్న 200, ఆముదం 500, పెసర 7 వేలు, వేరుశనగ 500తోపాటు ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నివేదించింది. సకాలంలో వర్షాలు కురిసి నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు నిరంతరంగా అందిస్తే వానాకాలం సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

ఎరువులకు ప్రతిపాదనలు..

వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా, డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులకు సంబంధించిన పత్రిపాదనలను జిల్లా వ్యవసాయ శాఖ.. రాష్ట్ర కమిషనరేట్‌కు నివేదించింది. యూరియా 1.61 లక్షల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 61,343 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌ఓపీ 33,758 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 12,923 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1,14,043 మెట్రిక్‌ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. గత వానాకాలం యాసంగి సీజన్‌లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈసారి ముందస్తుగా ప్రభుత్వానికి నివేదిక అందించింది.

ప్రభుత్వానికి నివేదిక

వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ముందుగానే వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి విత్తనాలు 16.81 లక్షల ప్యాకెట్లు (450 గ్రాములు), వరి 1,26,800 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను కావాలని నివేదించింది. కంది 14 వేల క్వింటాళ్లు, పెసర 7వేలు, వేరుశనగ 500 క్వింటాళ్లు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.

ఫ అత్యధికంగా వరి 5.86 లక్షలు, పత్తి 5.13 లక్షల ఎకరాలు

ఫ అవసరం మేరకు ఎరువులు, విత్తనాలకు ప్రతిపాదనలు

వానాకాలం సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువుల ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. – శ్రవణ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement