బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌

Mar 27 2026 9:28 AM | Updated on Mar 27 2026 9:28 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్‌ వ్యూ పాయింట్‌ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్‌ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్‌ అటవీ సీసీఎఫ్‌ సునీల్‌ హీరావత్‌, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, సాగర్‌ డీఎఫ్‌ఓ సంగీత, శ్రీనివాసరావు ఉన్నారు.

మహిళా సర్పంచ్‌ పై దాడి

నాంపల్లి : భూ తగాదాలో భాగంగా మహిళా సర్పంచ్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లపురాజుపల్లి గ్రామ సర్పంచ్‌ మంటిపల్లి మణిమాలకి, అదే గ్రామానికి చెందిన చినముత్తయ్య మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఐదు రోజుల క్రితం సర్పంచ్‌ మణిమాలకు సంబంధించిన భూమిలో చినముత్తయ్య ట్రాక్టర్‌తో దున్నడంతో సర్పంచ్‌, ఆమె భర్త శ్రీశైలం కలిసి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. దీంతో చినముత్తయ్య ఆగ్రహంతో సర్పంచ్‌ మణిమాల, ఆమె భర్తపై దాడికి దిగాడు. సర్పంచ్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె. లింగారెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మర్రిగూడ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన నాగిళ్ల బాబయ్య(37) తుఫాన్‌ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి వ్యవసాయ పొలంలోకి సిమెంట్‌ ఇటుకలు తీసుకొచ్చేందుకు మంగళవారం రాత్రి ఆటోలో కుర్మేడు గేట్‌ నుంచి చింతపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్‌ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని మర్రిగూడ మండలం వెంకటేశ్వర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement