నార్కట్‌పల్లి : నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్‌పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల, అయిటిపాముల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆసరా పెన్షన్లు పెంచలేదని ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అబద్ధపు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి బడ్జెడ్‌లో కూడా మొండిచేయి చూపిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ సొమ్ముతో దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థానిక నాయకులకు లంచం ఇస్తేనే పని మొదలుపెట్టే పరిస్థితి నెలకొందన్నారు. నేత, గీత కార్మికుల ప్రమాద బీమా సొమ్మును విడుదల చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ అడ్డదారిలో ముఖ్యమంత్రి సీటులో రేవంత్‌రెడ్డి కూర్చున్నాడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బైరెడ్డి కరుణాకరరెడ్డి, కరణం బలరాం, కొండూరు శంకర్, వాజీదు అలీ, దోసపాటి విష్ణుమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, కొత్త నర్సింహా, కర్నాటి ఉపేందర్, పోగుల నర్సింహా, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


