ఫ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్ బియ్యం వ్యాపారులు
మిర్యాలగూడ అర్బన్ : నకిలీ బ్రాండ్ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్‌ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది.
మార్కెట్‌లో కాకరకు దక్కని రేటు
ఫ పశువులు, గొర్రెలకు మేతగా వదిలేసిన రైతు
పెద్దవూర : మండలంలోని బట్టుగూడేనికి చెందిన రైతు కూన్‌రెడ్డి మధుసూదన్‌రెడ్డి రెండెకరాల్లో కాకర సాగు చేశాడు. పంట చేతికి వచ్చాక విక్రయించటానికి మార్కెట్‌కు వెళ్లగా కిలో రూ.10 అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తీగ పందిరిపై సాగు చేసిన కాకరకాయలకు మాత్రమే మార్కెట్‌లో డిమాండ్ ఉందని, కిలో రూ.10కి విక్రయిస్తే కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా రావని కాకర పంటలో పశువులు, గొర్రెలను మేపుతున్నట్లు తెలిపారు.


