నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్‌బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్‌రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్‌ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపారు.


