పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం | - | Sakshi
Sakshi News home page

పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం

Mar 21 2026 4:52 AM | Updated on Mar 21 2026 4:52 AM

పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్‌ నులక నాగార్జున్‌రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

పశు సంతతి గుర్తించాలి

పశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి.

మేలు జాతి పశువుల శరీర లక్షణాలు

పాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి.

పొదుగు లక్షణాలు

పశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి.

పశువుల కొనుగోలులో

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

అక్టోబర్‌, నవంబర్‌ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్‌ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి.

చూడాల్సిన అంశాలు

● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి.

● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి.

● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి.

● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి.

● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి.

● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి.

● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి.

● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి.

ఈ లక్షణాలు ఉంటే

పశువులను కొనకూడదు

● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే)

● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం

● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు

● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.

పశువుల బరువు తెలుసుకోవడం

పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు.

కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది.

ఎల్‌జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు.

ఎల్‌ అనగా పశువు ముందు జబ్బ పాయింట్‌ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో.

జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది.

పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్‌రెడ్డి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement