సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్‌లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్‌లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు.
60 మంది బాధితుల నుంచి
రూ.కోటి 85లక్షల వసూలు
నిందితుడి అరెస్టు, రిమాండ్


