ఆయకట్టుకు నీరిస్తున్నా.. నిండుకుండే!
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నుంచి ఆయకట్టులో పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నా.. ప్రాజెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోకు సమానంగా నిత్యం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం తగ్గడం లేదు. మూసీ ప్రాజెక్టు ఎగువన ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలు తమ అవసరాల కోసం వినియోగించిన నీరంతా నేరుగా మూసీకి చేరుతోంది. దీంతో పాటు మూసీ నది తీరం వెంట ఉన్న వలిగొండ, రామన్నపేట, శాలిగౌరారం మండలాల్లో సాగు చేసిన వరి పొలాల నుంచి జాలు కూడా మూసీకి వస్తోంది. ఇలా రోజూ 250 నుంచి 500 క్యూసెక్కుల నీరు మూసీ రిజర్వాయర్‌లో చేరుతోంది.
ఆయకట్టుకు సాగునీరు..
మూసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 35 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పంటలు పూర్తయ్యే వరకు నీటిని విడుదల చేశారు. అప్పటికీ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో(645 అడుగులు) నీటిమట్టం ఉండటంతో యాసంగి సీజన్‌లో పంటల సాగుకు మొదటి విడతగా గత డిసెంబర్ 15న నెల రోజుల పాటు, రెండవ విడతలో 15 రోజుల పాటు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు రోజూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 641అడుగుల (3.39 టీఎంసీలు) నీరు ఉంది.
ఫ నిత్యం నీటితో కళకళలాడుతున్న
మూసీ రిజర్వాయర్
ఫ ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో


