పోలింగ్‌కు పకడ్బందీ భద్రత
నల్లగొండ : మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఎలాంటి నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది, 5 ప్లాటూన్ల టీజీఎస్పీ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. 164 వార్డుల్లో 473 పోలింగ్ స్టేషన్లలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని.. ఆయా చోట్ల అదనపు బలగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్‌ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 333 మందిని బైండోవర్ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
నల్లగొండలో విస్తృత తనిఖీలు
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాత్రి పట్టణంలో విస్తత తనిఖీలు నిర్వహించారు. నల్లగొండలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చేపట్టిన తనిఖీలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పర్యవేక్షించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిళ్ల మద్యం, 64 చీరలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


