వికసించని ‘గిరి వికాసం’ | - | Sakshi
Sakshi News home page

వికసించని ‘గిరి వికాసం’

Feb 5 2026 7:17 AM | Updated on Feb 5 2026 7:17 AM

వికసించని ‘గిరి వికాసం’

వికసించని ‘గిరి వికాసం’

ఈ పథకం కింద జిల్లాలో 56 బోర్లు

వేసినా.. వాటికి మోటార్లు లేవు

రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం

అసలు ఈ పథకం ఉందా.. లేదా అని గిరిజనుల అనుమానం

గుర్రంపోడు : మెట్ట వ్యవసాయం చేస్తూ ఎదుగు బొదుగు లేని జీవితాలు గడుపుతున్న గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరివికాస పథకం అడుగు ముందుకు పడడం లేదు. రెండేళ్ల క్రితమే జిల్లా వ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్‌ సౌకర్యం, మోటార్లు అందించలేదు. వేసిన బోర్లకు కరెంటు, మోటార్లు అందిస్తే 380 ఎకరాలు సాగులోకి వచ్చేది. కానీ రెండేళ్లుగా ఎలాంటి కదలికా లేకపోవడంతో అసలు ఈ పథకాన్ని ఉన్నట్లా.. లేనట్లా అనే సందేహం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.

బోర్లకే పరిమితం

గతంలో ఉన్న ఇందిర జలప్రభను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం గిరివికాస పథకంగా పేరు మార్చింది. 2022లో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించి 110 మంది లబ్ధిదారులను ఎంపికచేశారు. ఇద్దరు, ముగ్గురు గిరిజన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా.. ఐదు నుంచి పది ఎకరాల భూములను యూనిట్‌గా తీసుకున్నారు. భూగర్భ జలవనరుల శాఖ నివేదిక మేరకు 2023 మార్చిలో వారి భూముల్లో 56 బోర్లు వేశారు. రెండేళ్లుగా వాటికి విద్యుత్‌ సౌకర్యంగాని, మోటార్లుగాని ఇవ్వలేదు. బోర్లు వేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు కూడా చెల్లించలేదు. కరెంటు సౌకర్యం కోసం విద్యుత్‌ సంస్థకు డబ్బులు జమ చేయడానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.

రైతుల ఆశలపై నీళ్లు..

ముందుగా కరెంటు సౌకర్యానికి నిధులు మంజూరైతేనే.. ఆ తర్వాత మోటార్లకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం ఇక్కడే అర్ధాంతరంగా నిలిచిపోయింది. లబ్ధిదారుల భూములను ఉపాధిహామీ పథకం ద్వారా అభివృద్ధి చేసి సాగులోకి తేవాల్సి ఉంది. సీఎం గిరివికాస పథకంలో తమ భూములకు సాగునీరు అందుతుందని, మెట్టభూములు సస్యశ్యామలం అవుతాయని ఆశించిన రైతులకు కానీ ప్రభుత్వ అలసత్వం కారణంగా నిరాశే ఎదురవుతోంది. అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్న విషయంలో అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా బోర్లకు మోటార్ల గురించి ప్రస్తావించిన దాఖలాలేవని పలువురు రైతులు వాపోతున్నారు.

గిరిజనుల భూముల్లో వేసిన బోర్లు ఇలా..

మండలం బోర్ల సంఖ్య

చందంపేట 4

చింతపల్లి 1

దేవరకొండ 11

డిండి 10

నాంపల్లి 3

నేరెడుగొమ్ము 1

గుర్రంపోడు 14

పీఏపల్లి 11

తిరుమలగిరిసాగర్‌ 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement