రేవంత్ రెడ్డివి నీతి మాలిన పనులు
నల్లగొండ టూటౌన్ : ‘సీఎంరేవంత్ రెడ్డివి అన్నీ నీతి మాలిన పనులే... ఇవ్వాళ కోడ్‌ను ఉల్లంఘిస్తూ మిర్యాలగూడ సభలో శంకుస్థాపనలు చేసిండు.. హడావుడి చేసిండు... దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి’ అని మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. ‘జిల్లాకు వచ్చిండు... అవే చిల్లర మాటలు, అవే బూతులు మాట్లాడి పోయిండు..అక్కడ ఉన్న మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మీద కూడా అవాకులు మాట్లాడిండు’ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిల్లర మాటలు, భూతులు మాట్లాడి సీఎం తన పరువు తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన మాటలకు కొంతమంది ఆహా ఓహో అంటూ వంతపాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు, ప్రజలకు ఏమి చేస్తావో చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మీద అవాకులు మాట్లాడాడని విమర్శించారు. అవి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని.. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు వేస్తామంటున్నాడని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్‌కి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి ఆ పార్టీ పెద్దలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
మిర్యాలగూడలో కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం స్పందించాలి


