అన్నపై తమ్ముడి విజయం
బొమ్మలరామారం : మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడగా అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ ఇస్లావత్ ఈర్యానాయక్ కుమారులు ఇస్లావత్ పాండు అతడి తమ్ముడు ఇస్లావత్ కృష్ణానాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. తిమ్మాపూర్‌కు చెందిన కుతాడి యాదగిరి కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఇస్లావత్ కృష్ణానాయక్‌కు 567 ఓట్లు, ఇస్లావత్ పాండుకు 361, కుతాడి యాదగిరికి 351 ఓట్లు వచ్చాయి. దాంతో ఇస్లావత్ కృష్ణానాయక్ తన అన్న పాండునాయక్‌పై 206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
నాడు భర్త ఓటమి.. నేడు భార్య గెలుపు
కేతేపల్లి : గత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసిన భర్య ఓటమి పాలయ్యాడు. అయినా ఆయన ప్రజలతోనే ఉండి వారి నమ్మకాన్ని కూడగట్టుకొని ప్రస్తుత ఎన్నికల్లో భార్యను పోటీ చేయించగా ఆమె విజయం సాధించింది. 2019లో కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దాంతో అదే గ్రామానికి చెందిన వంటల చేతన్‌కుమార్ పోటీ చేశాడు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా చేతన్‌కుమార్ వెనుకడుగు వేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందాడు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా చేతన్ భార్య సాహితి సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు. గురువారం జరిగిన పోలింగ్‌లో 133 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.
అప్పుడు భార్యలు.. ఇప్పుడు భర్తలు
బొమ్మలరామారం : గత ఎన్నికల్లో భార్యలు సర్పంచ్‌లుగా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో వారి భర్తలు పోటీ చేసి విజయం సాధించారు. మండలంలోని బండకాడిపల్లికి 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి లావణ్య సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రిజర్వేషన్ మారడంతో ఆమె భర్త పెద్దిరెడ్డి మల్లారెడ్డి పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందారు.
మైసిరెడ్డిపల్లి గ్రామంలో..
మండలంలోని మైసిరెడ్డిపల్లిలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన నోముల రమాదేవి సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె భర్త నోముల రాంరెడ్డి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు.
పాతికేళ్లకే సర్పంచ్..
రాజాపేట : రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన పాతికేళ్ల యువతి ఇండ్ల అనూష గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందింది. బేగంపేట గ్రామానికి చెందిన ఇండ్ల(మంత్రాల) సుమన్‌తో 2019లో అనూషకు వివాహం జరిగింది. అత్తగారింటికి వచ్చాక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. అదేవిధంగా దూదివెంకటాపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల నడిమింటి నరేష్, రాజాపేటకు చెందిన 29 ఏళ్ల కోయ మధు కూడా సర్పంచులుగా గెలుపొందారు.
అన్నపై తమ్ముడి విజయం
అన్నపై తమ్ముడి విజయం
అన్నపై తమ్ముడి విజయం
అన్నపై తమ్ముడి విజయం


