గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ శనివారం గుండెపోటుతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బస్వాపురం గ్రామానికి చెందిన వనగంటి లక్ష్మి(58) ఆ గ్రామంలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో నిలబడింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని శుక్రవారం వరకు ప్రచారం నిర్వహించింది. శనివారం ఆమె ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
కేతేపల్లి : ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కోట్ల శివ ఆటోలో శుక్రవారం రాత్రి సూర్యాపేట నుంచి నకిరేకల్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండల కేంద్రంలోని బస్ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న శివ తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కేతేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన మారగోని సైదులు ఈ నెల 11న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు సైదులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు, 6 గ్రాముల బంగారు చెవుల పట్టీలు, 20 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన సైదులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు సందర్శించి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు.


