రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత దుర్మరణం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత బొమ్మిడి నర్సిరెడ్డి(67) మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన బొమ్మిడి నర్సిరెడ్డి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో స్థిరపడ్డారు. స్థానికంగా బంగారిగడ్డ కాలనీ శివారులో బీఎస్ సీడ్స్ పేరుతో వరి విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పారు. శనివారం స్వగ్రామం పీపల్‌పహాడ్‌లోని తన వ్యవసాయ క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి చౌటుప్పల్‌కు వస్తుండగా.. పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మేనబావ అవుతారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గంజాయి పట్టివేత
భువనగిరి : బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం భువనగిరి ఎక్సైజ్ సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఓ వ్యక్తి గంజాయి విక్రయించేందుకు వస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పండుగ భానుచందర్ గంజాయి విక్రయిస్తుండగా అతడిని పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన బొబ్బల నరేందర్‌రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. 1.120 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకుని భువనగిరి ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.


