యాదగిరి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై నో ఫ్లయింగ్ జోన్‌లో శనివారం ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేశాడు. ఎస్‌పీఎఫ్ పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గాజులరామారంలో నివాసముంటున్నాడు. శనివారం స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆ వ్యక్తి కొండ కిందకు వెళ్లి డ్రోన్ ఎగురవేసి కొండ పైన పరిసరాలు, నో ఫ్లయింగ్ జోన్‌ను చిత్రీకరిస్తుండగా.. స్థానికుల ద్వారా ఎస్‌పీఎఫ్ పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వెంటనే అతడి వద్దకు ఎస్‌పీఎఫ్ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తిని అప్పగించడంతో పట్టణ సీఐ కేసు నమోదు చేశారు.


