భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నూతనంగా చేపడుతున్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్జీ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనులపై ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, నిధుల విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదనంగా రూ.50 కోట్లు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


