నేడు దేవరకొండకు ముఖ్యమంత్రి రాక
దేవరకొండ: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం దేవరకొండ పట్టణానికి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండ పట్టణంలోని పలు వార్డుల్లో రూ.13 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు, 7,9,10 వార్డుల్లో రూ.2.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, 20 వార్డుల్లో రూ.50 లక్షలతో సీసీ డ్రెయిన్‌ల నిర్మాణం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రూ.2 కోట్లతో స్టేడియం, బీఎన్‌ఆర్ కాలనీలో రూ.2 కోట్లతో పార్క్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి శిలాఫలకాలను సభా వేదిక వద్ద సిద్ధం చేశారు. అంతేకాకుండా రూ.11.33 కోట్ల విలువ గల బ్యాంక్ లింకేజీ చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు సీఎం పంపిణీ చేయనున్నారు.
పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో దేవరకొండ పట్టణంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బందోబస్తును సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. సీఎం హెలిపాడ్ నుంచి కాన్వాయ్‌లో సభకు చేరుకునే వరకు రోప్ పార్టీలు, పెట్రోలింగ్ టీమ్‌లు, ట్రాఫిక్ డైవర్షన్, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 36మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యేలు
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి శుక్రవారం సభాస్థలి, హెలిపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేవరకొండ: దేవరకొండ పట్టణంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు. శేరిపల్లి రహదారిలో బహిరంగ సభతోపాటు హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం:
ఎస్పీ శరత్‌చంద్ర పవార్
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేకంగా ఏడు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఫ రూ.20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఫ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న
ఎమ్మెల్యే బాలునాయక్
నేడు దేవరకొండకు ముఖ్యమంత్రి రాక


