నామినేషన్ వేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు
చందంపేట : సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన వ్యక్తిని అడ్డుకున్న ఘటన చందంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చందంపేట మండలంలోని ముర్పునూతల గ్రామపంచాయతీకి చెందిన బిజిలి వెంకటయ్య శుక్రవారం ముర్పునూతల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు చందంపేట క్లస్టర్ కేంద్రానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంకటయ్య నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ముర్పునూతల గ్రామ సర్పంచ్ స్థానం జనరల్‌గా రిజర్వ్ అయ్యింది. కాగా రూ.21 లక్షలకు గ్రామస్తుల అంగీకారంతో ఏకగ్రీవం చేసుకున్న నేపథ్యంలో.. వెంకటయ్యను నామినేషన్ వేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
దేవరకొండ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండల పరిధిలోని తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పీహెచ్‌సీ పరిధిలోని ఆశా వర్కర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో గర్భిణుల ఇళ్లను సందర్శించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు కళ్యాణచక్రవర్తి, కేస రవి, డాక్టర్ విజయ తదితరులు ఉన్నారు.
హామీలు అమలు చేయాలి
దేవరకొండ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నక్కలగండికి అవసరమైన నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు విద్యాసాగర్, వస్కుల సుధాకర్, నక్క వెంకటేష్, గుండాల అంజయ్య, వినోద్, రవి పాల్గొన్నారు.
నామినేషన్ వేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు
నామినేషన్ వేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు


