సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురిచేసినా డయల్ 100కు ఫోన్ చేయండి. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతాం. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే మా బాధ్యత. అందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాత నేరస్తులపై నిరంత నిఘా ఉంటుంది. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. అలాంటి వారి యాక్టివిటీపై ఎస్సైలు ఆకస్మిక తనిఖీలు, పరిశీలన చేస్తున్నారు. నేను ఐదారు గ్రామాల్లో తనిఖీల్లో పాల్గొన్నా. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
సమస్యలుంటే ‘డయల్ 100’కు ఫోన్ చేయవచ్చు
3,035 క్రిటికల్
కేంద్రాల్లో అదనపు బలగాలు
ప్రతి మండలంలో నలుగురు ఎస్సైలతో పర్యవేక్షణ
జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 7,494 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా 2500 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒక్కో డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ రెస్పాన్స్ టీం పనిచేస్తుంది. ర్యాలీలు, సభల కోసం ఆయా మండలాల్లోని రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రచారాల్లో సౌండ్ బాక్సులను అనుమతి తప్పనిసరి.
800 మంది బైండోవర్
గ్రామాల్లో ఎలాంటి గొడవలకు తావులేకుండా అవగాహన కల్పిస్తున్నాం. 800 మంది పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేశాం. ఆయా గ్రామాల్లో నాతో పాటు డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు కూడా గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించాం. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినా, ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు చేపడతాం. గ్రామాల్లో ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలను సరెండర్ చేయాలని ఆదేశించాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాటిని సరెండర్ చేశారు.
3,035 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
ఇప్పటికే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటి పరిధిలో అదనపు పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 7,494 పోలింగ్ స్టేషన్లు ఉంటే 3,035 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాం. ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో 5 నుంచి 6 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తాం. ఎలాంటి గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయి. గొడవలకు పాల్పడే వారిపై నిఘా ఉంటుంది. ఎన్నికల తరువాత కూడా వారు అదే మండలంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు. ప్రతి మండలంలో నలుగురు ఎస్‌ఐలతో పాటు సిబ్బందిని నియమిస్తున్నాం. అలాగే ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీంలు (క్యూఆర్‌టీలు) ఏర్పాటు చేశాం.
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా దైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ చేపడుతున్న భద్రత ఏర్పాట్లను ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ


