సమర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి
నల్లగొండ : పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకుంటే వారు తన వద్దకు వచ్చి పనులు చేయించుకుని గ్రామాలను అబ్ధివృద్ధి చేస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని కతాల్‌గూడెం నుంచి దర్వేశిపురం వరకు నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని మిగతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఏకగ్రీవమైతే రూ.30 లక్షలు
ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకునే ఆ గ్రామానికి సొంతంగా రూ.10 లక్షలు, తన నిధుల నుంచి మరో రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.30 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించారు. ప్రజలు సమర్థులైన వారిని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ ఎక్స్‌రోడ్డు నుంచి దర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించి.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.450 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ పనులు చేపడతామన్నారు. నల్లగొండకు రింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నల్లగొండలోనే రూ.వెయ్యి కోట్ల పైచిలుకు పనులు చేపట్టామన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలాల్లో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించబోతున్నామని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బొట్టుగూడలో నిర్మించిన పాఠశాలను డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, శ్రీనివాసగౌడ్, ఆలకుంట్ల నాగరత్నంరాజు, దర్వేశిపురం ఆలయ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, బారత వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ పంచాయతీల్లో కాంగ్రెస్ సర్పంచ్‌లను గెలిపించాలి
ఫ మిగతా పార్టీ వారు గెలిచినా ప్రయోజనం ఉండదు
ఫ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


