మూడేళ్లకు ప్రజాభిప్రాయం
కట్టంగూర్ : కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన గద్దపాటి దానయ్య 2001లో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 800 ఓట్లు ఉండగా దానయ్యకు 450 ఓట్లు రాగా ప్రత్యర్ధి పులి నర్సింహకు 350 ఓట్లు వచ్చాయి. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత 2004లో తన పాలనపై రెఫరెండం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో రెఫరెండం చేపట్టారు. దానయ్య రైతు గుర్తుతో, వ్యతరేకంగా క్రాస్ గుర్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఈ రెఫరెండం పోలింగ్‌లో మొత్తం 750 ఓట్లు పోలవ్వగా 110 ఓట్ల మెజార్టీతో గద్దపాటి దానయ్య గెలుపొందారు. తన పాలనపైనే ప్రజల తీర్పు కోరిన దానయ్య ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15, 2004లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రజల ఆమోదంతో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు.
ప్రజాపాలనలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే రెఫరెండం విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ మెరుగు పడుతుంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు కలిగేలా పనులు చేయాలంటే ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలి
– గద్దపాటి దానయ్య, మాజీ సర్పంచ్, పందెనపల్లి


