చైన్ స్నాచింగ్‌కు పాల్పడి అప్పులు తీర్చాడు
మిర్యాలగూడ అర్బన్ : మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణం దీక్షిత్‌నగర్‌కు చెందిన మందడి వినోద్ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చాలంటూ అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 14న మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంలో వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్‌పై పారిపోయాడు. హుజూర్‌నగర్ మండలం రామస్వామిగట్టుకు చెందిన తన స్నేహితురాలు షేక్ నజ్మాకు సదరు బంగారు పుస్తెల తాడు ఇచ్చి ఆమె పేరుపై శ్రీరామ్ ఫైనాన్స్‌లో రూ.2.30 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుల్లోంచి కొంత అప్పు తీర్చి, మిగతా దాంతో పేకాట ఆడి పోగొట్టుకున్నాడు. సీతారంపురంలో జరిగిన చైన్‌స్నాచింగ్‌పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు పట్టణంలోని సీసీ కెమరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మళ్లీ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడేందుకు ఈ నెల 25న నంబర్‌లేని పల్సర్ బైక్‌పై మిర్యాలగూడకు రాగా రాజీవ్‌చౌక్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇతడిపై ఇప్పటికే హుజూర్‌నగర్, మునగాల, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 3.2 తులాల బంగారు పుస్తెల తాడు, పల్సర్ బైక్, సెల్‌ఫోన్, చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నామని, వినోద్‌తో పాటు అతడికి సాయం చేసిన షేక్ నజ్మాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన టూటౌన్ సీఐ సోమనర్సయ్య, సిబ్బందికి రివార్డులు అందించారు. ఆయన వెంట ఎస్‌ఐ బి.రాబాబు, ఏఎస్‌ఐ చంద్రయ్య, సిబ్బంది ఉన్నారు.


