అనుమానాస్పద స్థితిలో వలస కూలీ మృతి
మునుగోడు : పత్తి మిల్లులో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో మంగళవారంజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ముస్తఫా జాఫర్ సార్జారాల్(30) తమ ప్రాంతానికి చెందిన మరో 15 మందితో కలిసి 15రోజుల క్రితం మునుగోడుకు వచ్చాడు. వీరంతా కొంపల్లిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో పని చేస్తున్నారు. ముస్తఫా సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని అదే మిల్లులో ఉన్న తమ నివాసానికి వెళ్లాడు. మద్యం తాగిన ముస్తాఫా జాఫర్ తోటి కూలీతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో తోటి కూలీ అతడిని మిల్లులోకి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి పత్తి కుప్ప వద్ద నిద్రించారు. అతడి వెంట నిద్రించిన వ్యక్తి మంగళవారం ఉదయం లేచి పనికి వెళ్లాడు. జాఫర్ పనికి రాకపోవడంతో మిల్లు నిర్వాహకులు, తోటి కూలీలు వెతికగా పత్తి కుప్పలో విగతజీవిగా పడి ఉన్నాడు. మద్యం మత్తులో తోటి కూలీలు కొట్టడంతో మృతి చెందాడా లేదా పత్తి కుప్ప వద్ద నిద్రించిన అతడిని గమనించకుండా ట్రాక్టర్ సాయంతో పత్తిని మిల్లులో వేసే సమయంలో మృతి చెందాడా అనేది తేలాల్సి ఉంది. అతడి కుటుంబ సభ్యులు వచ్చేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించవద్దని తోటి కూలీలు అడ్డు తగలడంతో అక్కడే ఉంచారు.


