హమాలీగానూ.. ఆమె
పెన్‌పహాడ్ : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో కూలీలుగా పని చేసిన మహిళలు ఇప్పుడు హమాలీలుగా పని చేస్తూ తాము తలచుకుంటే ఏపనైనా చేయగలమని నిరూపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేస్తూ మగ వారితో సమానంగా పనులు చేస్తున్నారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 10 మంది మహిళలు హమాలీలుగా పనులు నిర్వహిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లోకి ఎత్తడం, దానిని తూకం వేయడం, బస్తాలను సీల్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు, పత్తి ఏరే పనులు చేపడుతున్నారు. అయితే వరిని యంత్రాల ద్వారా కోయడం, ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి దెబ్బతినడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోయింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. రోజుకు 500 బస్తాల్లో ధాన్యం నింపి తూకం వేయడం ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు కూలి వస్తున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు. అయితే ఇన్న రోజులు హమాలీల కొరత కారణంగా కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మహిళలు హమాలీ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో కాంటాలు వేగవంతమై తమ ఇబ్బందులు తీరాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో
ధాన్యం కాంటాల నిర్వహణ
ఉపాధి పొందుతున్న
వ్యవసాయ కూలీలు
హమాలీగానూ.. ఆమె


