రాజేష్‌ను అకారణంగా పొట్టనపెట్టుకున్నారు
కోదాడ : కోదాడకు చెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్‌ను పోలీసులు అకారణంగా చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని, దీనికి కారణమైన చిలుకూరు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్ పాత నేరస్తుడు కాకపోయినా.. చిలుకూరు పోలీసులు ఐదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం వలనే మృతిచెందాడని ఆరోపించారు. రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడంతో పాటు అతడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలుకూరు పోలీసులు ఏ తప్పు చేయనప్పుడు రూ.8లక్షలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. దళితులు చనిపోతున్నా దళిత మంత్రులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. దళితల కోసం గ్రేహౌండ్స్ తరహా రక్షణ దళం ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుడు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్


