ఆయిల్‌పామ్.. లక్ష్యానికి దూరం
ఆయిల్‌ఫామ్ ప్యాక్టరీ
నిర్మాణం ఎప్పుడో..?
మార్చి 2026 నాటికి నిర్దేశించిన సాగు లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మొక్కలు నాటాం. మిగతా 4500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. జిల్లాలోని అన్ని సహకార సంఘాల రైతులకు అవగాహన కల్పించాం. చాలామంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడానికి ముందుకొస్తున్నారు.
– కె.సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు లక్ష్యానికి దూరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 14 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ తోటలు సాగు చేశారు. ఈ ఏడాది మరో 6500 ఎకరాల్లో తోటలు సాగు చేయించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలల్లో రెండు వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పామ్ తోటలు రైతులు సాగు చేశారు. మార్చి నాటికి మిగిలిన 4500 ఎకరాల్లో సాగు చేయించేందుకు గాను ఉద్యానవన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కానీ, నాలుగు నెలల్లో లక్ష్యం చేరుకోవడం అనుమానంగానే ఉంది.
సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం..
ప్రస్తుత మార్కెట్‌లో ఆయిల్‌పామ్ గెలలకు మంచి గిరాకీ ఉంది. ప్రభుత్వం కూడా తోటల సాగుకు ప్రోత్సాహం ఇస్తోంది. పంట చేతికొచ్చేంత వరకు నాలుగేళ్ల పాటు ఎకరానికి రూ.4,200 ఇస్తుంది. ఎకరానికి 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందులో రైతు వాటా కేవలం రూ.23 మాత్రమే. మొక్క నాటిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు వస్తుంది. పెద్ద రైతులకు 80 శాతం, చిన్న రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తోంది. దీనిపై ఉద్యానవన శాఖ అవగాహన కల్పిస్తుండటంతో రైతులు తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.
టన్ను ధర రూ.20,506..
ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.20,506 ధర పలుకుతుంది. పతంజలి సంస్థ జిల్లాలో ఆయిల్‌పామ్ గెలలను కొనడానికి అనుముల, త్రిపురారం మండలం ముకుందాపురం, నిడమనూరు మండలం ముప్పారం, మాడ్గులపల్లి మండలం కుక్కడం, నల్లగొండ మండలం చందనపల్లి గ్రామాల్లో ఆయిల్‌పామ్ గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా ఆయా కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
ఫ ఈ ఏడాది 6500 ఎకరాల్లో సాగు లక్ష్యం
ఫ ఎనిమిది నెలల్లో రెండు వేల ఎకరాల్లోనే సాగు
ఫ మార్చి చివరి నాటికి లక్ష్యం చేరడం అనుమానమే..
ఫ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పడని అడుగు
పతంజలి సంస్థ జిల్లాలో ఆయిల్‌పామ్ ప్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో ప్యాక్టరీ నిర్మాణం కోసం 26 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసింది. ప్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ఏడాది నుంచి ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌బాబా సమయం కుదరకపోవడంతో నిర్మాణ పనుల శంకుస్థాపనకు జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆయిల్‌పామ్.. లక్ష్యానికి దూరం


