ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు!
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయకపోవడంతో 139 మంది ఇళ్లను రద్దు చేసి ఇతరులకు అవకాశం ఇచ్చాం. స్థలం సమస్య కారణంగా కూడా కొందరు ఇల్లు వద్దని చెప్పి రాసిచ్చారు.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్
నల్లగొండ టూటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పలువురు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సాయం సరిపోయే అవకాశం లేకపోవడం, నిబంధనల కారణంగా కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి విముఖత చూపుతున్నారు. నీలగిరి మున్సిపాలిటీలో 550 ఇళ్లు మంజూరు కాగా.. 139 మంది మాకు ఇల్లు వద్దని రాసిచ్చారు. ఆ ఇళ్లకు ముగ్గు కూడా పోయకపోవడంతో వాటిని రద్దు చేసి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు.
45 వేల దరఖాస్తులు
ఇళ్ల నిర్మాణం కోసం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల నుంచి దాదాపు 45 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో నీలగిరి మున్సిపాలిటీకి 550 ఇళ్లను మంజూరు చేసింది. పట్టణంలో 48 వార్డుల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 550 మంది లబ్ధిదారుల్లో 139 మంది ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు రాకపోవడం, ముగ్గు కూడా పోయకపోవడంతో మున్సిపల్ అధికారులు వాటిని రద్దు చేశారు. ఆ 139 లబ్ధిదారుల స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించారు.
ఆర్థిక స్థోమత లేదని కొందరు..
ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసినా రాని వారు కొందరు ఉంటే.. అదృవశాత్తు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కొందరు మాకొద్దు అంటున్నారు. కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఇంటి నిర్మాణం చేపడుతుండగా, చేతిలో నయా పైసా లేని వారు ఇంటి నిర్మాణం చేయాలంటే మా దగ్గర పైసలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ.10 లక్షల ఖర్చు అవుతుందని లబ్ధిదారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలతో ఇబ్బందులు..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా కొందరికి ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కొందరివి గ్రామ కంఠం స్థలాలు కాగా, మరి కొందరికి వక్ఫ్‌బోర్డు స్థలాలు ఉండడం ప్రభుత్వ నిబంధనలకు అడ్డంకిగా మారింది. ఇక, 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే నిర్మాణం చేపట్టానే నిబంధన కూడా లబ్ధిదారుల అనాసక్తికి కారణంగా తెలుస్తోంది. కాగా ప్రభుత్వం నిబంధనలను సడలించాలని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు.. మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినట్లు తెలిసింది.
ఫ ఇళ్ల నిర్మాణంపై నీలగిరి
మున్సిపాలిటీలో లబ్ధిదారుల అనాసక్తి
ఫ మాకొద్దని రాసిచ్చిన 139 మంది లబ్ధిదారులు
ఫ అసలు ముగ్గు పోయకపోవడంతో
ఇతరులకు అవకాశం


