ప్రభుత్వ పాఠశాలలో చెట్లు నరికివేత
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అక్కలాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ చెట్లను గుట్టు చప్పుడు కాకుండా కొట్టివేశారు. సుమారు 10 చెట్లకు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చెట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చెట్లను సదరు వ్యాపారి సెలవురోజున నరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. చెట్లను తొలగించడంపై గ్రామానికి చెందిన కొందరు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఈఓ భిక్షపతి, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఈఓ భిక్షపతి వివరణ కోరగా.. అక్కలాయిగూడెం పాఠశాలలో చెట్లు నరికేసి అమ్ముకున్నారని ఫిర్యాదు అందిన మాట వాస్తవమే అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయడానికి నార్కట్‌పల్లి ప్రధానోయపాధ్యాయుడిని విచారణ అధికారిగా నియమించామని తెలిపారు.
రూ. 30వేలు జరిమానా
అక్కలాయగూడెం పాఠశాలలో అక్రమంగా చెట్లను నరికేసిన కాంట్రాక్టర్‌ఫై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు పాఠశాలను సందర్శించి విచారించారు. చెట్లను కొట్టి తీసుకుపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రూ.30,300 చలానా కట్టించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఫ కలెక్టర్, డీఈఓకు గ్రామస్తుల ఫిర్యాదు
ఫ కాంట్రాక్టర్‌కు జరిమానా విధించిన అటవీశాఖ అధికారులు


