పాడి రైతులకు త్వరలో బిల్లులు చెల్లిస్తాం
యాదగిరిగుట్ట : మదర్ డెయిరీలో పాడి రైతుల బిల్లులు త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి రైతులంతా క్షమించాలని సంస్థ చైర్మన్ జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధికారులు, మదర్ డెయిరీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టర్ల సమిష్టి నిర్ణయంతోనే మదర్ డెయిరీని ఎన్‌డీడీబీకి ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించేందుకు ఎన్‌డీడీబీ సిద్ధంగా ఉండటంతో ఆ బ్యాంక్ అధికారులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ల నుంచి క్లియరెన్స్ తీసుకొని త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో బ్యాంక్ అధికారులు చెప్పారన్నారు. లోపాలను సరిదిద్దుకుంటూ, మదర్ డెయిరీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ను సబ్సిడీ కింద ఇస్తామన్నారు. మళ్లీ రైతులంతా మదర్ డెయిరీకి పాలు పోయాలని, వారందరికీ 15 రోజులకు ఒకసారి డబ్బులు అకౌంట్‌లో వేస్తామని ఎన్‌డీడీబీ హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో కళ్లెపల్లి శ్రీశైలం, గొల్లేపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహ, శ్రీధర్‌రెడ్డి, సందిళ్ల భాస్కర్‌గౌడ్, మండలి జంగయ్య, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, కస్తూరి పాండు, రంగారెడ్డి, బి.నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


