పోచంపల్లికి కర్ణాటక చేనేత కార్మికులు
భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్ వస్త్ర తయారీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 58 మంది చేనేత కార్మికులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌లో మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలు, రంగులద్దకం, చిటికి కట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక టెక్స్‌టైల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ సీనియర్ ఆఫీసర్ దివాకర్‌బాబు, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు మాట్లాడుతూ.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని మూడు చేనేత సహకార సంఘాలకు చెందిన చేనేత కార్మికులు పోచంపల్లి ఇక్కత్ వస్త్ర తయారీలో అవలంబిస్తున్న టెక్నిక్‌లను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా చేనేతకు పేరెన్నికగన్న నారాయణపేట, వెంకటగిరి, మధురై, సేలం తదితర ప్రాంతాలను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు.


