నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
భువనగిరి టౌన్ : డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లికొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భువనగిరిటౌన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్‌బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు. అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్‌కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. తనను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆగస్టు 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడు కరీంనగర్‌కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ వివరించారు.


