ఎస్‌ఐ తీరుపై గ్రామస్తుల నిరసన
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి అకారణంగా కాంగ్రెస్ నాయకుడు అన్నెం కరుణాకర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కాంగ్రెస్ నాయకులతోపాటు స్థానికులు నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అన్నెం కరుణాకర్‌రెడ్డి స్థానిక రామాలయంలో జరుగుతున్న అయ్యప్పస్వాముల పూజకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి అతడి వాహనాన్ని ఆపి దురుసుగా ప్రవర్తిస్తూ సెల్‌ఫోన్, బైక్ తాళాలను లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తనకే సమాధానం చెబుతావా అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడని కరుణాకర్‌రెడ్డి ఆరోపించాడు. స్పందించిన సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు ఎస్‌ఐ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రహదారిపై కాంగ్రెస్ నాయకులు, స్థానికులు చేస్తున్న ఆందోళనను పోలీసులు నచ్చజెప్పి విరమింపజేశారు.
మొదటి నుంచి వివాదాస్పదమే..
వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి మొదటి నుంచి వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. గతంలో దామరచర్ల మండలానికి చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును చిన్న పంచాయితీని ఆసరాగా చేసుకుని అకారణంగా స్టేషన్‌లో విచక్షణ రహితంగా కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసు విషయంలో సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయినప్పటికీ ఎస్‌ఐ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


