శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా
నాగార్జునసాగర్ : సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ ప్రయాణం వాయిదా పడినట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. టికెట్లు తక్కువగా బుక్ కావడంతో ఈ శనివారం లాంచీ వెళ్లడం లేదని.. తిరిగి ఎప్పుడు వెళ్లేది ప్రకటిస్తామన్నారు. కార్తీక మాసం మొదలై శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూయగానే లాంచీ ప్రయాణం మొదలైతే సుమారుగా మూడు ట్రిప్పులైనా వేసేవారు. పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, ప్రచారం లేకపోవడంతో టికెట్లు బుక్ కాలేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఇన్‌చార్జ్ న్యాయమూర్తిగా రాధాకృష్ణ చౌహాన్
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తిగా సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహాన్ శుక్రవారం స్థానిక కోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. తన పరిధిలో కక్షిదారులందరికీ సత్వర న్యాయం అందించడం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.మారుతిప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయోషా షరీన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


