నేనున్నానని..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అడవి తల్లే వారి ప్రపంచం. ఊరు దాటి పట్టణానికి వెళ్లే వారు తక్కువ. అప్పుడప్పుడు పట్టణానికి వచ్చే ఆ కొద్దిమందికే ఆధార్ కార్డులున్నాయి. అవీ ఎప్పుడో తీసుకున్నవి. వాటిని అప్‌డేషన్ చేయించుకునే అవకాశం లేక వారు సంక్షేమ పథకాలు దూరమవుతున్నారు. పిల్లలు పెద్దగైనా రేషన్ కార్డుల్లో పేర్లు లేక రేషన్ అందని వారూ ఉన్నారు. బుక్కెడు తిండి కోసం తంటాలు పడుతున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోని తిరుమలగిరిసాగర్ మండలం చెంచుకాలనీ ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి మీకు అండగా నేనున్నానంటూ ముందుకొచ్చారు.
తండావాసి ఆదమ్మ ఫిర్యాదుతో..
అందరిలాగే తమ జీవితాలు బాగుండాలని, తమ బతుకులు మారాలన్న ఆలోచన ఆ చెంచు కుంటుంబాల్లోని ఒక మహిళ శీలం ఆదమ్మకు వచ్చింది. 20 రోజుల కిందట కాలనీవాసులు కొందరిని వెంట తీసుకొని కలెక్టరేట్‌లో ప్రజావాణికి వెళ్లి కలెక్టర్ ఇలా త్రిపాఠికి తమ గోడు వివరించింది. తాము ఐదు దశాబ్దాలుగా అడవిలోనే బతుకున్నామని, కనీస సౌకర్యాలు లేవని, తాగటానికి కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, రెండు, మూడు రోజులకు ఒకసారి వచ్చే భగీరథ నీటినే నిల్వ చేసుకొని తాగాల్సి వస్తోందని, కొన్నిసార్లు అవీ రావడం లేదని, కాలనీలో మోటార్లు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయని ఇలా సమస్యలతో కూడిన లేఖను కలెక్టర్‌కు అందజేసింది. ఐదు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని, ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాయని వివరించింది.
కలెక్టర్ స్పందించి.. స్వయంగా వచ్చి..
ఆదమ్మ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి ఎలాగైనా న్యాయం చేయాలనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఆయన కూడా వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకే ఎమ్మెల్యేతో సహా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను తన వెంట తీసుకొని కాలనీకి చేరుకున్నారు. చెంచుకాలనీ మొత్తం కలియదిరిగి, వారికి కావాల్సిన సదుపాయలను అడిగి తెలుకొని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరికి ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేషన్ చేయించారు. చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు, కులం, నివాస, ఆదాయం ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేయించారు. నూతన పెన్షన్లు, నూతన రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు నమోదు చేయించారు. వీటితో పాటు చెంచులకు ప్రత్యేకంగా సబ్సిడీ యంత్రాలు, ఆరోగ్య శ్రీ సేవలు, ఎయిర్‌టెల్ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో మాట్లాడి సెల్ టవర్‌ను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చెంచువానికాలనీ స్వరూపం
తిరుమలగిరి(సాగర్) మండలంలో చెంచువానితండా గతంలో నెల్లికల్లు గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం మూల తండా, చెంచువానితండా (మొత్తం 60 ఇళ్లు, 210 ఓటర్లు్), చెంచువాని కాలనీ కలిపి (43 కుటుంబాలు, 110 మంది ఓటర్లు) కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అన్నీ మట్టి రోడ్లే. చీకటి పడితే కాలనీ మొత్తం అంధకారమే. విద్యుత్ సదుపాయం లేదు.
ఫ చెంచుల సమస్యలు పరిష్కరించేందుకు వారి వద్దకే వెళ్లిన కలెక్టర్
ఫ అభివృద్ధికి ఆమడ దూరంలో ఆ గ్రామం
ఫ ప్రభుత్వ పథకాలకు నోచుకోని కుటుంబాలు
ఫ వారికి భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నేనున్నానని..


