యువకళపై నిర్లక్ష్యం!
నేడు జిల్లా యువజన కళాకారుల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే ఇక్కడి అధికారులు మాత్రం నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జిల్లాస్థాయి యువజనోత్సవాలపై ముందుగానే జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న యువతకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులపై ఉంటుంది. ఇక్కడ గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న యువజనోత్సవంపై ముందుగానే మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా యువతకు జిల్లా యువజనోత్సవాలపై సమాచారం తెలియకుండా పోయింది.
అధికారుల మధ్య సమన్వయ లోపం..
ఈనెల 22వ తేదీన నల్లగొండలో జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపిక సమాచారం మీడియా సైతం శుక్రవారం సాయంత్రం పంపడం గమనార్హం. నవంబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు స్వయంగా కార్యాలయంలో గానీ, మెయిల్‌కు లేదా, వాట్సప్ నంబర్ (8074487020) ద్వారా గానీ పేర్లు నమోదు చేయించుకోవాలని నిబంధన పెట్టారు. సంబంధిత శాఖ అధికారులు జిల్లా యువజనోత్సవాలకు ఒక్కరోజు ముందు పత్రికల ద్వారా సమాచారం అందిస్తే వారు యువజనోత్సవాల్లో పాల్గొనడానికి సాధ్యమేనా అనే అనుమానాలు ఎవరికై నా రావడం సహజం. సంబంధిత శాఖలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కూడా ఇందుకు కారణంగా తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జిల్లా యువజనోత్సవాలపై అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్ధం కావడానికి సమయం లేదు
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువజనోత్సవాల సమచారం కనీసం నాలుగు రోజులు ముందుగానే అందిస్తే యువత ఆయా పోటీలకు సన్నద్ధం అవుతుంది. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. యువజనోత్సవాల్లో జానపద నృత్యం గ్రూప్, జానపద గేయాలు గ్రూప్, వ్యాసరచన, పోస్టర్ తయారి, వక్తృత్వ పోటీ, కవిత్వం, ఇన్నోవేషన్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) నిర్వహిస్తారు. వాటికి సన్నద్ధం కావాలంటే మూడు, నాలుగు రోజుల సమయం పడుతుంది. ఒక్కరోజు ముందు సమాచారం ఇవ్వడంతో యువత యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీని వివరణ కోరగా ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు చెప్పడం గమనార్హం. మరిఎంత మందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారో అధికారులకే తెలియాలి.
ఫ యువజనోత్సవాల సమాచారం చేరవేడంలో అధికారుల మీనమేషాలు
ఫ నేడు యువజన కళాకారుల ఎంపికలు.. శుక్రవారం మీడియాకు సమాచారం
ఫ కళాకారులు సిద్ధమయ్యేందుకు కూడా సమయం లేదు
ఫ మంచి అవకాశానికి దూరమవుతున్న యువత
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 15 నుంచి 29 సంవత్సరాలలోపు వారై ఉండాలని, ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి యువజనోత్సకాలకు పంపుతామని పేర్కొన్నారు. జానపద నృత్యం గ్రూప్, జానపద పాటల గ్రూప్, కథారచన (హిందీ, ఇంగ్లిష్, తెలుగు), పెయిటింగ్, ఉపన్యాసం వక్తృత్వం, కవిత్వం (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) అంశాలపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8074487020 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


