పత్తి కొనాలని రైతుల ఆందోళన
మునుగోడు : రెండు రోజుల పాటు సీసీఐ కేంద్రం పడిగాపులు కాయించి తమ పత్తి కొనుగోలు చేయకుండా నిరాకరించడంపై ఆగ్రహిస్తూ మునుగోడులో పలువురు రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో 20వ తేదీన స్లాట్ బుక్ చేసుకొని 19వ తేదీ రాత్రే మునుగోడులోని సలాసర్ బాలాజీ పత్తి మిల్లు వద్ద క్యూలో పెట్టారు. ఆ వాహనాల్లోని పత్తి తేమశాతం చూసిన సీసీఐ సిబ్బంది పత్తి కొనుగోలు చేస్తామని చెప్పి పట్టా పాస్‌పుస్తకం జిరాక్స్‌లపై తేమశాతం రాసి క్యూలో ఉండమని చెప్పారు. వాహనాలు అధికంగా ఉండటంతో వాటి సీరియల్ వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. ఆ సమయంలో సీసీఐ సర్వర్ రావడం లేదని, ఇప్పుడు కొనుగోలు చేయలేమని.. మరుసటి రోజు కొనుగోలు చేస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో రైతులు తమ పత్తి వాహనాలను మిల్లులోనే ఉంచారు. తిరిగి ఉదయం కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ సిబ్బంది పత్తి బాగా లేదని దిగుమతికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మిల్లు ఎదురుగా ఉన్న మునుగోడు–చౌటుప్పల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చండూరు సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎస్‌ఐ రవి అక్కడికి చేరుకుని ఆందోళన చేయకుండా రైతులను అడ్డుకున్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి రెండు రోజులు పడిగాపులు కాయించి పత్తి కొనుగోలు చేయకపోవడం సరికాదని, ఎలాగైనా ఆ రైతుల పత్తి దిగుమతి చేసుకుని వారికి న్యాయం చేయాలని సూచించారు. దీంతో సీసీఐ అధికారి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు.


