ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ ముందుంది
ఫ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోిషి
నల్లగొండ: ధాన్యం ఉత్పత్తి, సేకరణలో నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ముందుందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోదాము ఆవరణలో నూతనంగా నిర్మించిన డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎఫ్‌సీఐ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాముల్లో 60 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే మరో ఎఫ్‌సీఐ గోదామును నల్లగొండలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బియ్యం సూర్యాఘర్ ముక్తి బిజిలీ పథకం కింద 20,175 ఇళ్లకు రూ.20 వేల కోట్ల రాయితీ ఇస్తున్నామన్నారు. రైతులు వరిపైనే కాకుండా ఆయిల్ సీడ్స్ వాణిజ్య పంటలు పండించాలని కోరారు. కోవిడ్ సమయంలో తెలంగాణకు రావాల్సిన సబ్సిడీ రూ.343 కోట్లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంఆర్ డెలివరీకి సంబంధించి 10 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్లకు సరైన రికార్డులు సమర్పిస్తే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు.
కేంద్ర మంత్రికి వినతి
జిల్లా రైతుల కోసం ఆధునిక ధాన్యం గోదాము, బత్తాయి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నవించారు. ఆధునిక గోదాములు లేకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం నాణ్యత తగ్గి, సకాలంలో ఎఫ్‌సీఐకి పంపడం కష్టంగా మారిందని తెలిపారు. జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమన్నారు. గోదాముల నిర్మాణానికి తిప్పర్తి మండలంలో స్థలం అందుబాటులో ఉందన్నారు. నల్లగొండలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా తయారు చేస్తారని, ఇక్కడి మిల్లర్లకు రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ ఏదైనా ఎఫ్‌సీఐకి ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. బత్తాయి నిల్వ సమస్యలను అధిగమించడానికి, అత్యవసరంగా 2500 మెట్రిక్ టన్నుల(ఎంటీ) సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్‌ను నల్లగొండకు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2025–26కు సంబంధించి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎఫ్‌సీఐ ఈడీ వనిత శర్మ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్‌సీఐ అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ ముందుంది


