నేడు ఉపాధ్యాయులకు అవగాహన సమావేశం
నల్లగొండ టూటౌన్ : వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాజెక్టుల తయారీపై ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నల్లగొండ సమీపంలోని చర్లపల్లి డీవీఎం కాలేజీలో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల భౌతిక శాస్త్రం, గణితం, జీవశాస్త్రం ఉపాధ్యాయుల్లో ఒకరు తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరారు.
బాయిల్డ్ రైస్ కోటా మంజూరు చేయాలి
నల్లగొండ: జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గురువారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యాన్ని వేగంగా తరలించడానికి జిల్లాకు అదనపు రైల్వే వ్యాగన్లను కేటాయించాలని లేఖలో కోరారు.
రహదారులపై ధాన్యం ఆరబెట్టొద్దు
నల్లగొండ: రహదారులపై రైతులు ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రాత్రి సమయంలో రోడ్లపై ధాన్యాన్ని ఉంచి, రాళ్లు పెట్టడం, నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనబడక, వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఒక్కోసారి వాహనదారుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు.
సీఎంఆర్ సమస్యలను పరిష్కరిస్తాం
నల్లగొండ: వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ నరసింహరాజు అన్నారు. గురువారం నల్లగొండలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్‌లో 2024–25, 2025–26 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), వానాకాలం ధాన్యం సేకరణపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలంకు సంబంధించిన ధాన్యం అన్‌లోడ్‌ను మిల్లర్లు వెంటనే చేసుకోవాలని సూచించారు. మిల్లర్లు కోరినట్లు 2023–24 సీఎంఆర్ చెల్లింపు పొడిగింపు వస్తుందని తెలిపారు. జిల్లాకు ఎక్కువ వేగన్స్ కేటాయింపు వచ్చే అవకాశముందన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్. జె.శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు కర్నాటి నారాయణ, రేపాల భద్రాద్రి, జూలకంటి ఇంద్రాడ్డి, వీరమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ వసతి గృహంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ వెంకట య్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీలోపు ఎమ్మార్సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
నేడు ఉపాధ్యాయులకు అవగాహన సమావేశం


