సహకార రంగంలో అపార అవకాశాలు
నల్లగొండ టూటౌన్ : సహకార రంగంలో యువతకు అపార అవకాశాలు లభిస్తున్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటీవ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.గణేశన్ అన్నారు. గురువారం ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థులకు సహకార రంగంలో అవకాశాలపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర చట్టాలకు లోబడి భావసారూప్యత కలిగిన 20 మంది వ్యక్తులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా సహకార రంగంలో సాధించిన విజయాలను విద్యార్థులకు వివరించారు. ఇంటర్న్‌షిప్ అవకాశాలు సైతం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూసీసీబీఎం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీదేవి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ హరీష్ పాల్గొన్నారు.


